Tuesday, May 21, 2024

కెసిఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది

  • ఉస్మానియా యూనివర్శిటీలో సెలవులపై బిఆర్‌ఎస్ అనవసర రాజకీయం చేస్తోంది
  • తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కెసిఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు
  • కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్
  • 2023 ఆనాటి ఆర్డర్ కాపీని ట్వీట్‌కు జతచేసిన సిఎం రేవంత్‌రెడ్డి

కెసిఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ట్విట్టర్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో సెలవులపై బిఆర్‌ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 2023లోనూ నీరు, కరెంట్ లేక హాస్టళ్లకు సెలవు ఇచ్చారంటూ ఆనాటి ఆర్డర్ కాపీని సిఎం రేవంత్ రెడ్డి జతచేసి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వచ్చాకే వర్శిటీ మూసివేస్తున్నట్టు ప్రచారం చేయడం కెసిఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కెసిఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు.

బిఆర్‌ఎస్ పాలనలో కూడా సెలవులిచ్చారు…
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేస్తూ నోటీసులను జారీ చేశారు. (12-.05-.2023 నుంచి 05.-06.-2023 వరకు) సెలవులను ఇవ్వడంతో పాటు ఆ సమయంలో విద్యుత్, నీటి కొరత గురించి అప్పటి చీఫ్ వార్డెన్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా వర్శిటీ సెలవులు పొలిటికల్ హీట్ పెంచాయి.

ప్రస్తుతం ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేసవి సెలవులిస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులిచ్చారు. అయితే నీటి సమస్య, కరెంటు కోతలను చీఫ్ వార్డెన్ ఉత్తర్వుల్లో ప్రస్తావించడం ప్రస్తుతం రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పాటు తాగునీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ సెలవులే నిదర్శనమని కెసిఆర్ ఫైర్ అయ్యారు. దీంతో రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular