-
బాచుపల్లిలో ఘోర ప్రమాదం
-
రిటర్నింగ్ వాల్ కూలి ఏడుగురు మృతి
-
కేసు నమోదు
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రేణుక ఎల్లమ్మ కాలనీలో సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై రిటన్నింగ్ వాల్ కూలి పడడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. కుండపోత వర్షం పడటంతో ఒక్కసారిగా గోడ కూలింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను వెలికితీశారు. మృత్యువాత పడిన కార్మికులు ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూకట్ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. హరిజాన్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల వివరాలను వెల్లడించారు.
మృతులు వీరే
1) మజ్జి తిరుపతి (20), ఒడిశా
2) శంకర్ (22), ఒడిశా
3) రాజు (25), ఒడిశా
4) కుషి (రాజు భార్య), ఒడిశా
5) రామ్ యాదవ్ (34), ఛత్తీస్‌ఘడ్
6) గీత (రామ్ యాదవ్ భార్య), ఛత్తీస్‌ఘడ్
7) హిమాన్షు (4 ఏళ్లు), ఛత్తీస్‌ఘడ్
కేసు నమోదు
బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి డెడ్‌బాడీలను ఇప్పటికే గాంధీకి తరలించారు. అలాగే గాయపడిన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వరాష్ట్రాలకు తరలించనున్నారు.
మరోవైపు, ఈప్రమాదంలపై బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడకూలి కార్మికులు మృతి చెందారని తెలిపారు. మొత్తం 7 మంది చనిపోయారని.. వారిలో నలుగురు ఒరిస్సాకు చెందిన వారు, ముగ్గురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తోందని తెలిపారు. భవన యజమాని అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. చనిపోయిన వారిలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.