పిడుగుపాటుకు ఇద్దరి మృత్యువాత
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగుపడి దాసరి అజయ్ అనే 23 యువకుడు మృత్యువాడ పడ్డాడు.
ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడి తల్లి రేణుక తృటితో తప్పించుకుంది. ఈ పిడుగుపాటులో అజయ్‌తో సహా రెండు గేదెలు కూడా చనిపోయాయి. దీంతోపాటు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడగూడెంలో పిడుగు పాటుకు బాస బుల్లోడు (46)అనే రైతు మృతి చెందాడు.
మహబూబాబాద్ జిల్లాలో వడగళ్ల వాన
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో వడగళ్ల వాన కురవగా, నల్గొండ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ముందస్తుగా తెలిపింది.
నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. నేడు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.