Tuesday, May 14, 2024

ఎన్నికలను సవాల్ తీసుకున్న మంత్రులు

  • అప్పగించిన నియోజకవర్గాలతో పాటు సొంత నియోజకవర్గాల్లో
  • అభ్యర్థులను గెలిపించుకోవడానికి సమష్టి కృషి
  • సభలు, రోడ్డు షోలు, సుడిగాలి పర్యటనలతో కార్యకర్తల్లో జోష్

మిషన్-15లో భాగంగా 15 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళుతుండగా ఈ ఎన్నికలను మంత్రులు సవాల్‌గా తీసుకున్నారు. పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు వారిని ఇన్‌చార్జీలగా నియమించి కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించడంతో వారంతా నిర్వీరామంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తుండడంతో పాటు రోజు సభలు, రోడ్డు షోల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు సైతం తమకు అప్పగించిన నియోజకవర్గాలతో పాటు తమ సొంత నియోజకవర్గాలపై దృష్టి సారించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్న సిఎం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మిషన్-15 లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయానికి వ్యూహారచనను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో మెజార్టీ తక్కువగా ఉన్న స్థానాలపై సిఎం రేవంత్ దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను సిఎం రేవంత్ అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలను తెప్పించుకుంటున్న అధిష్టానం, దానికి తగ్గట్టుగా సిఎం రేవంత్‌ను, మంత్రులను అప్రమత్తం చేస్తోంది. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు సైతం పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యధిక స్థానాల్లో గెలుపే దిశగా అడుగులు వేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు తమ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. బూత్‌స్థాయి నుంచి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలు, సన్నాహక సమావేశాలు, ర్యాలీలతో అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్ధేశం
మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్‌సభ బాధ్యతలను అప్పగించారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. దీంతో ఆమె ఆదిలాబాద్‌పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఏకైక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సీతక్క ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసిసి ప్రకటించిన ఐదు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. బిఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ బిఆర్‌ఎస్,బిజెపిలపై విమర్శలు చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

ఖమ్మం సీటును గెలిపించుకోవడం కోసం ముగ్గురు మంత్రుల కృషి
మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్‌సభ సీటు బాధ్యతలను అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఒక్క సీటును మాత్రమే పార్టీ గెలుచుకుంది. ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు. ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డిల మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా, పొంగులేటి సూచించిన ఆయన వియ్యంకుడు రఘురాంరెడ్డికే టికెట్ దక్కింది.

ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఏర్పడింది. గ్యారంటీల అమలు, అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటును గెలిపించుకోవడానికి మంత్రులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బిజెపిపై మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని బిజెపికి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని వారు విమర్శిస్తున్నారు.

పలు నియోజకవర్గాలపై మంత్రుల దృష్టి
అయితే ఇతర నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు తమ సొంత నియోజకవర్గాలను వదిలిపెట్టకుండా రెండింటిపైనా దృష్టి సారించారు. కొందరు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి ఇన్‌చార్జీగా ఉన్న దామోదర్ రాజనరసింహ మెదక్ పార్లమెంట్ స్థానం విషయంలోనూ సమన్వయం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన బిఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు 19,000ల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన మంత్రులు కూడా తమకు అప్పగించిన వాటితో పాటు తాము తోడ్పాటు అందించగలిగిన నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టి ప్రచారాలకు వెళ్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular