Sunday, May 19, 2024

మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగానికి ప్రమాదం

  • మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగానికి ప్రమాదం
  • రిజర్వేషన్లకు మంగళం పాడటమే బీజేపీ ఎత్తుగడ
  • పాతిక మంది పెద్దల చేతుల్లోనే సంపద ఏకీకృతం
  • యువతకు ఉపాధి కాంగ్రెస్ లక్ష్యం
  • నిర్మల్ సభలో రాహుల్ గాంధీ

ఎందరో మేధావులు రూపొందించిన రాజ్యాంగ రూపు రేఖలు మార్చటమే మోడీ ప్రభుత్వ లక్ష్యమని, దీన్ని అరికట్టేందుకు కాంగ్రెసుకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు అధినేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తూ రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలని ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క కాంగ్రెసు రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నిస్తే దాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్లు కూడా పోతాయని హెచ్చరించారు. దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తోందని, దాదాపు రూ.16 లక్షల కోట్ల రూపాయలు కేవలం 22 నుంచి 25 మంది కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయని, ఇవి 70 కోట్ల ప్రజల వద్ద ఉన్న మొత్తానికి సమానమని అన్నారు. ఈ పరిస్థితిని మార్చటమే కాంగ్రెసు ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్పొరేట్ల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, వీటితో 25 కోట్ల మందికి ఉపాధి కలిగేదన్నారు. దేశంలో 90 శాతం మంది పేద, మధ్య తరగతి వర్గాల వారు ఉండగా కేవలం 10 శాతం కార్పొరేట్లు మాత్రమే ఆధిపత్యం చలాయిస్తున్నారన్నారు. కాంగ్రెసు గెలిస్తే రిజర్వేషన్లను 50 శాతం నుంచి మరింత పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని, ఇందులో భాగంగానే పబ్లిక్ సెక్టర్ రంగాలను ప్రయివేటు పరం చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అన్నారు.

ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్లు అమలు చేసే అవసరం ఉండదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెసు అధికారం చేపడితే తెలంగాణాలో ఇచ్చినట్లే హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు రూ.2500 నెలకు ప్రకటించినట్లుగానే కేంద్రంలో కూడా మహిళలకు నెలకు రూ. 8500 చొప్పున ఏటా రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో కలిపి తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకు రూ.1.30 లక్షలు అందుతాయని అన్నారు. ఇందుకోసం మహిళలను ఎంపిక చేసేందుకు సమగ్ర సర్వే జరిపించనున్నట్లు తెలిపారు. దేశంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం నౌకరీ గ్యారంటీ ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది పాటు ఉద్యోగాన్ని ఇవ్వనున్నామన్నారు. పని తీరును బట్టి వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. ఇందువల్ల దాదాపు 30 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని అన్నారు. తమ ప్రభుత్వం గెలిచాక ఉపాధి హామీ క్రింద ఇపుడు ఇస్తున్న రూ.250 రోజు కూలీని రూ.400 కు పెంచుతామని అన్నారు. అంగన్వాడీలు, ఆశాల వేతనాల్లో కూడా మార్పు చేస్తామన్నారు.

మీడియాపై విసుర్లు

ఇదిలా ఉండగా తన ప్రసంగంలో రాహుల్ గాంధీ మీడియా పై విసుర్లు విసిరారు. మీడియా సంస్థలన్నీ కార్పొరేట్ల చేతుల్లో బందీలయ్యాయని అన్నారు. మోడీ కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేస్తే మీడియా సంస్థలు అభివృద్ధి జరుగుతోందని ప్రకటిస్తున్నాయని అన్నారు. మీడియాలో పేదవారెవరూ లేరని అందుకే ఈ పరిస్థితి అని అన్నారు. తాను భారత్ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు కోట్లాది మంది జనం తన వెంట నడిచారని, తెలంగాణలో కూడా బ్రహ్మరథం పట్టారన్నారు. మోడీ ప్రభుత్వ ద్వేషపూరిత విధానాలకు దూరంగా రాష్ట్రంలో కాంగ్రెసుకు పట్టం కట్టారని, కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం కానుందని అన్నారు. ఆదివాసీ మహిళా అయిన ఆత్రం సుగుణను గెలిపించి కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వానికి బలం చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క తదితరులున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular