- మెమోలు, షోకాజ్‌లు ఇచ్చినా మేమింతే..!
- కాసులను వెనుకేసుకోవడంలో ఆరితేరిన ఉద్యోగులు, అధికారులు…?
- వాణిజ్య పన్నుల శాఖలో చాలామంది మోనార్కులు
కాసులను వెనుకేసుకోవడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ఆరితేరారు. ప్రభుత్వానికి కట్టించాల్సిన పన్నులను కట్టకుండా వ్యాపారులకు మేలు చేసి కోట్లలో కూడబెట్టుకుంటున్నారు. ఆ శాఖ తీరుపై, అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు జరుపుతున్నా వారు తీరులో మాత్రం మార్పు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయిలో పనిచేసే అధికారుల వరకు ఎవరికి వారే వసూళ్లలో తమ మార్కును చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వ్యాపారులు ఎగ్గొడుతున్న జిఎస్టీ, పన్నుల వసూళ్లకు కృషి చేస్తుంటే ఆ శాఖ ఉద్యోగులు, అధికారులు మాత్రం అందినకాడికి దోచుకోవడం విశేషం.
ఆబిడ్స్ డివిజన్‌లో పనిచేసే ఓ అధికారిపై ఆరోపణలు వచ్చినా….
కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చే మెమోలను తప్పించుకోవడానికి, ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఇంటికి కావాల్సిన సరుకులు, వారి ఇంటి అవసరాలను దగ్గరుండి చూసుకుంటూ తమ వసూళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆబిడ్స్ డివిజన్‌లో పనిచేసే ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు భారీగా వచ్చినా ఇప్పటివరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకోవడం విశేషం. ఈ మధ్య ఆరోపణలు వచ్చిన కొందరు ఉద్యోగులు, అధికారులపై కొరడా ఝుళిపించిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమ ఇంటి అవసరాలు తీర్చే ఉద్యోగుల అవినీతి గురించి చూసీ చూడనట్టుగా వ్యవహారిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తుండడం విశేషం.
READ ALSO: తీహార్ జైలుకు బిగ్ బాస్ సుఖేష్ మరో లేఖ
వ్యాపారులను బెదిరించి లక్షల్లో డబ్బు….
ఇక విద్యానగర్ డివిజన్‌లో పనిచేసే ఓ అధికారి వ్యాపారులను బెదిరించి వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఆ అధికారికి లంచం ఇవ్వకపోతే మిగతా రాష్ట్రాల్లోనూ ఆయా వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనతో పాటు తన పైఅధికారులకు కూడా ముడుపులు ఇవ్వాలని వ్యాపారులతో ఆయన ఖరాఖండిగా చెబుతుండడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం.
స్టీల్ కంపెనీ, రియల్ కంపెనీకి మేలు చేస్తూ …..
అయితే ఈ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులు, అధికారుల అవినీతి ఇలా ఉంటే ఇద్దరు అడిషనల్ స్థాయి అధికారులు గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని పేర్కొందిన స్టీల్ కంపెనీ, రియల్ కంపెనీకి మేలు చేస్తూ ఒక్కొక్కరూ రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వెనుకేసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరిలో ఒక అడిషనల్ స్థాయి అధికారి కొత్త కమిషనర్ వచ్చాక తన అవినీతి బయటపడకుండా ప్రస్తుతం ట్రిబ్యునల్ మెంబర్‌గా వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయినా అడిషనల్ స్థాయి అధికారులు ఇద్దరూ ఈ స్టీల్ కంపెనీ, రియల్ కంపెనీలకు సంబంధించిన వాహనాలను పట్టుకోకుండా తమకున్న అధికారాన్ని ఇప్పటికి వినియోగిస్తున్నట్టుగా తెలిసింది. ఐదారేళ్లుగా ఈ స్టీల్ కంపెనీ, రియల్ కంపెనీలు జిఎస్టీ ఎగవేతకు సంబంధించి వీరిద్దరూ అధికారులే ఆయా కంపెనీలకు మార్గదర్శకులుగా వ్యవహారిస్తున్నట్టుగా సమాచారం. దీంతో వీరిద్దరికి భారీగా ప్రతినెలా లక్షల్లో ముడుపులు అందుతున్నాయని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా పేర్కొంటున్నారు. ఇవన్నీ తెలిసినా తమ శాఖ ఉన్నతాధికారులు కనీసం వారిద్దరిపై చర్యలు తీసుకోవడం లేదని, కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులపై చర్యల పేరుతో మెమోలను జారీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెమో ఇచ్చినా మారని వైఖరి
ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ అవినీతికి పాల్పడిన పలువురు ఉద్యోగులకు మెమోలను జారీ చేసినా కొందరిలో మార్పు రాకపోవడం విశేషం. ఈ మధ్యనే ఓ అధికారి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అడిషనల్ కమిషనర్‌కు తెలియకుండా లంచాలు తీసుకోవడం మరమ్మతుల పేరుతో లక్షలను స్వాహా చేయడంతో కమిషనర్ ఆయనకు మెమో ఇచ్చింది. అయినా ఆయనలో మార్పు రాకపోగా వారం రోజుల క్రితం జరిగిన ఉద్యోగుల డిప్యూటేషన్‌లోనూ ఆయన మరోసారి అవినీతికి పాల్పడ్డారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉద్యోగుల డిప్యూటేషన్ విషయంలో (అడిషనల్ కమిషనర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉన్నతాధికారిని) తప్పుదారి పట్టించి పలువురు ఉద్యోగుల నుంచి భారీగా డబ్బులను వసూలు చేసి వారికి హెడ్ ఆఫీసులోనే పోస్టింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.