Tuesday, May 14, 2024

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకరైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకరైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే సెలవుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పెషల్ రైళ్లను ప్రకటించగా వచ్చేనెలలో ఎన్నికల కోసం మరిన్ని రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఉద్యోగం, ఉపాధి కోసం తెలంగాణలో ఉంటున్నవారు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైలు ప్రయాణాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో పనిచేసే వారి కోసం ఈ ప్రత్యేక రైళ్లను వేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వైపు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువమంది ఉత్తర భారతదేశానికి చెందినవారు ఉండడంతో నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే దానాపూర్, గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌లను ఆయా ప్రాంతాలకు అధికారులు వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

సికింద్రాబాద్ – టు సంత్రగాచిల మధ్య 42 రైళ్లు…
సికింద్రాబాద్ – టు సంత్రగాచిల మధ్య 42 రైళ్లు, కాచిగూడ- టు కోచువెలి -టు కాచిగూడల మధ్య 4 సర్వీసులను దక్షిణమధ్య రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్- టు ఆరిస్కరా మధ్య 38 ప్రత్యేక రైళ్లను అధికారులు నడుపుతున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి. ఇలా సికింద్రాబాద్- టు దానాపూర్, హైదరాబాద్ టు- గోరఖ్‌పూర్, కాచిగూడ- టు కోచువెలి, సికింద్రాబాద్- టు అగర్తల, సికింద్రాబాద్ -టు సంత్రగాచి, సికింద్రాబాద్ – షాలీమర్, సికింద్రాబాద్- టు పాట్నా, తిరుపతి టు షిర్డీ, కాచిగూడ టు- మధురై, సికింద్రాబాద్- టు కొళ్లం, హైదరాబాద్ టు కటక్, హైదరాబాద్- టు రాక్సౌల్ ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ నడిచే రైళ్లకు తోడు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కూడా ప్రత్యేక రైళ్లున్నాయి.

ఈ సీజన్‌లో మొత్తం 1,079 ప్రత్యేక రైళ్లు…
సికింద్రాబాద్ -టు తిరుపతి, లింగంపల్లి- టు కాకినాడ, హైదరాబాద్- టు నర్సాపూర్, సికింద్రాబాద్ -టు విశాఖపట్నంల మధ్య ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ సీజన్‌లో మొత్తం 1,079 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దానాపూర్‌కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి 11 రైళ్లు వెళ్తున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతాయి, అటువైపు నుంచి ఇదే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లన్నీ అన్ రిజర్వ్‌లోనూ నడుస్తుంటాయి. ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ ప్రెస్‌లో వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్ల మాదిరి వీటిని నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ప్రత్యేకరైళ్లలో వెయిటింగ్ లిస్ట్…
తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎపి ఎన్నిల్లో ఓటేసేందుకు వెళ్లేవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకరైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. ఏసి బోగీల్లోనూ టికెట్లు దొరకడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

మే 10, 11వ తేదీల్లో కూడా దూరప్రాంత రైళ్లలో ఒక్కో బండిలో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు కన్పిస్తుంది. కొన్నింట్లో అయితే ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్ వస్తోంది. కానీ, వచ్చే నెలలో ఎన్నికలు ఉండటంతో నెలరోజుల ముందే టికెట్లు అయిపోయినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరీబ్ రథ్‌లోనూ భారీగా వెయిటింగ్ లిస్ట్ కన్పిస్తుందని, గౌతమి ఎక్స్ ప్రెస్లో, విశాఖ ఎక్స్ ప్రెస్లో, ఈస్ట్ కోస్ట్లో వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యలో ఉన్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular