రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, దాంతో పాటు మూడు రోజుల పాటు అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అత్యవసర పనులుంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని ఐఎండీ సూచించింది. 2015, 2016 సంవత్సరాల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు ఆ ఎండల తీవ్రతకు చాలా మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఎండలు అప్పటి కాలాన్ని గుర్తు చేస్తున్నాయని, మళ్లీ ప్రజలు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.