Saturday, May 18, 2024

కాంగ్రెస్ అభ్యర్థులకు పలు స్థానాల్లో త్రిముఖ పోటీ

  • 15 స్థానాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాలు
  • కానీ, ప్రచారంలో కొన్నిచోట్ల వెనుకబడిన అభ్యర్థులు
  • క్షేత్రస్థాయిలో మారుతున్న ఓటర్ల నాడీ
  • 5 నియోజకవర్గాల్లో గెలుపుకోసం మరింత శ్రమించాలంటున్న కాంగ్రెస్ కేడర్

రాష్ట్రంలో గడిచిన పది రోజులుగా ఓటర్ల నాడీ మారుతుండడంతో కాంగ్రెస్ పార్టీ మరింత శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా చోట్ల సునాయాసంగా గెలుస్తారనుకున్న లోకసభ స్థానాలు సైతం గట్టి పోటీని ఇస్తుండడంతో వాటిపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు స్థానాల్లో త్రిముఖ పోటీ ఎదుర్కొనాల్సి వస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో 15 లోకసభ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తుంది. కానీ, నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో మరింత శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది.

మాల, మాదిగలకు టికెట్ల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడం, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ముందు నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుండడం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేకపోవడం లాంటివి కాంగ్రెస్ కొంత కలిసిరాని అంశాలుగా చెప్పవచ్చు. మార్చిలో నిర్వహించిన సర్వేలో అభ్యర్ధులతో సంబంధం లేకుండానే 12 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఉన్నట్లు సునీల్ కనుగోలు సర్వేలో వెల్లడైంది. కానీ, గడిచిన పది రోజులుగా క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడీ మారుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందులో భాగంగా దానిని అధిగమించేందుకు పార్టీ సత్వర చర్యలు చేపడుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడం లేదని భావిస్తున్నరాష్ట్ర నాయకత్వం అలాంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో పట్టు కోల్పోవడం
నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బిజెపికి సానుకూలంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు వదిలి పెడితే మిగిలిన చేవెళ్ల, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేకపోవడంతో చేరికలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసుకునే దిశలో చొరవ చూపుతోంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోకసభ స్థానాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో మరింత శ్రమించాల్సి…
మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్ధి ఈటెల రాజేందర్‌ను, ఢీ కొనేందుకు సునీతా మహేందర్‌రెడ్డిని, సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు దానం నాగేందర్‌ను బరిలో దించినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి మారతారని విస్తృతంగా ప్రచారం జరగడం ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న భావనతో వెనుకబడినట్టుగా అంచనా వేస్తున్నారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపి అయినప్పటికీ బిజెపి నుంచి విశ్వేశ్వర రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ మరింత శ్రమించాల్సి వస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సాధారణంగానే ఇక్కడ ఉన్నత వర్గాలు ఓట్లు వేసే శాతం చాలా తక్కువ ఉంటున్నందున మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓట్లపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏయే ప్రాంతాల్లో ఏయే సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు, వారిని పార్టీ వైపు తిప్పుకోడానికి ఉన్న అవకాశాలపై కూడా కాంగ్రెస్ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కూడా గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular