Sunday, May 19, 2024

రాష్ట్రంలో బీర్లు నో స్టాక్…!

  • బ్రీవరీల మూడో షిప్ట్‌కు అనుమతి లేదు…
  • ఇతర రాష్ట్రాల నుంచి బ్రాండ్ బీర్లు తెప్పించుకోవడానికి
  • ఇబ్బంది పడుతున్న ఎక్సైజ్ శాఖ
  • గత నెలలో 6.02 కోట్లు బీర్ల విక్రయాలు
  • ఈ నెలలో అది మరింత పెరిగే అవకాశం
  • ఎన్నికల నేపథ్యంలో అధికంగా అమ్ముడవుతున్న బీర్లు

బీర్ల ఉత్పత్తి తగ్గొద్దని ఆబ్కారీ శాఖ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం అన్ని మద్యం షాపుల్లో బీర్లు నోస్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. నెలరోజుల క్రితం నీటి కొరతతో బీర్ల ఉత్పత్తి తగ్గడంతో దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. బీర్లను తయారీ చేసే కంపెనీలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా ఆయా కంపెనీలకు నీటిని సైతం సరఫరా చేస్తోంది. అయినా బీర్ల కొరత ఏర్పడడంతో బీరు ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వేసవి కాలంలో బీర్ల కొరత రాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వాటిని కొనుగోలు చేసుకునేవారు.

అయితే ప్రస్తుతం ఎన్నికల నియమావళి అడ్డురావడంతో ఈసారి ఎలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. మాములుగా వేసవికి ముందే బఫర్ స్టాక్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రంలోని 17 మద్యం డిపోల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండు లక్షల బీర్లకు తక్కువ లేకుండా 25 నుంచి 30 లక్షల బీర్లను బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకునే వారు. డిమాండ్‌ను బట్టి అబ్కారీ శాఖ అధికారులు మద్యం షాపులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం రోజుకు 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోతుండగా వేసవికాలంలో 20 నుంచి 30 లక్షల బీర్లు ప్రతిరోజు అమ్ముడవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

2023,-24 ఆర్థిక సంవత్సరంలో 65.76 కోట్ల బీర్ల విక్రయం
మాములుగా రాష్ట్రంలో సాధారణంగా లిక్కర్ అమ్మకాల కంటే బీర్లు విక్రయాలు అధికమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో బీర్లు విక్రయాలు అధికంగా అమ్ముడు పోతున్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 4.71 కోట్లు బీర్లు అమ్ముడు పోగా ఇందులో రెండో వంతు మాత్రమే లిక్కర్ విక్రాయాలు జరిగాయి. ఫిబ్రవరిలో 5.17 కోట్లు బీర్లు విక్రయాలు జరగ్గా లిక్కర్ ఇందులో రెండో భాగం కంటే తక్కువ అమ్మకాలు జరిగాయని అధికారులు లెక్కలు చెబుతున్నాయి.

ఇక, మార్చిలో 6.15 కోట్లు బీర్లు అమ్ముడు పోగా లిక్కర్ విక్రయాలు మాత్రం సగమే జరిగాయి. ఏప్రిల్ నెలలో 6.02 కోట్లు బీర్లు విక్రయాలు జరగ్గా లిక్కర్ ఇందులో సగం కంటే కొంచెం ఎక్కువ అమ్ముడు పోయింది. ఏప్రిల్ నెలలో అమ్ముడు పోయిన బీర్ల సంఖ్యను తీసుకుంటే రోజుకు సగటున 20 లక్షలకుపైగా బీర్లు అమ్ముడు పోవడం విశేషం. ఇక మే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2023,-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,493 కోట్లు విలువైన 65.76 కోట్ల బీర్లు, 43.54 కోట్లు లిక్కర్ బాటిళ్లు మద్యం అమ్ముడుపోవడం విశేషం.

కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి…
రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టుగా బీర్లు దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎక్సైజ్ శాఖ అన్వేషిస్తోంది. అయితే బ్రీవరీలకు మూడో షిప్ట్‌కు అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం, డిమాండ్ అధికంగా ఉండే బ్రాండ్లు కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ భావించినా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల మూలంగా అదనంగా బీర్లు అమ్ముడుపోతుండటంతో ఏర్పడిన ఈ కొరత, ఇప్పట్లో తీరే అవకాశం లేదని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

ప్రతి 45 రోజులకు బిల్లులు చెల్లించే విధానం…
దీనికి తోడు బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు ప్రతి 45 రోజులకు బిల్లులు చెల్లించే విధానం రాష్ట్రంలో కొనసాగుతోంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బ్రీవరీలకు చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో దాదాపు రెండువేల కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు బీర్ల ఉత్పత్తిపై వెనుకడుగు వేస్తున్నట్టుగా సమాచారం. పాత బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని బ్రీవరీల యాజమానులు కోరుతున్నారు.

ముందస్తు చర్యలకు ఆబ్కారీ శాఖ కసరత్తు
బీరు ప్రియులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్‌లలో ప్రధానంగా బడ్వైయిజర్, నాక్‌ఔట్, రాయల్ ఛాలెంజ్, కింగ్‌ఫిషర్, కార్లస్బెర్గ్, హైవార్డ్, టుబర్గ్, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడు పోతుంటాయి. రాష్ట్రంలో ఆరు బ్రీవరీ కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. కానీ, డిమాండ్‌ను బట్టి ఇక్కడ ఉత్పత్తిని పెంచుకోవడం, బయట నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి ముందస్తు చర్యలు అబ్కారీ శాఖ తీసుకునేది. కానీ, ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఏ నిర్ణయం తీసుకున్నా నియమావళికి లోబడి ఉండాల్సి ఉంటుండడంతో బీర్ల కొరతతోనే ఈ వేసవి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular