Tuesday, April 30, 2024

సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి పుణ్యక్షేత్రం

  • నేడు శ్రీరాముడి కల్యాణ మహోత్సవానికి అంతా సిద్ధం
  • ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్న
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

శ్రీరాముడి కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామ నామస్మరణతో ఇప్పటికే భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. కాగా, శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ప్రతిసారి భద్రాద్రిలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుండడంతో సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మిథిలా మైదానంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం మిథిలా మండపాన్ని అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు.

తలంబ్రాలు సమర్పించనున్న సిఎస్
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆంక్షలు పాటిస్తూ సీతారాముల చంద్రస్వామి వారి కల్యాణం, మహా పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్షప్రసారాలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యల ద్వారా భక్తకోటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.

భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి 15 వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించడానికి పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల నుంచి భక్తులు సీతారాముల కల్యాణ మహోత్సవానికి పాదయాత్ర చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి సుమారు 200 కిలోమీటర్ల మేర భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి కదిలి రావడం విశేషం.

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
భద్రాచలం వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కదిలి వచ్చే భక్తులకు ఆలయ ఈఓ రమాదేవి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. దీంతోపాటు ఉచిత భోజన వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించాలని అధికారులు సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular