Monday, May 13, 2024

మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయి

  • మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయి
  • మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మాదిగ జాతిని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు అణగదొక్కాయని ఆయన ధ్వజమెత్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఆయన హెచ్చరించారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తాకట్టు పెట్టొద్దన్నారు. రిజర్వేషన్లకు మొదటి అడుగు వేసిందే కాంగ్రెస్ అని ఆయన చెప్పారు. పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను న్యాయబద్దంగా రిజర్వేషన్లను అమలు చేయగలదని మందకృష్ణ మాదిగ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ హయాంలో వర్గీకరణ రాష్ట్రాలకు అప్పజెప్పాలని ఉషా మెహ్రా కమిషన్‌ను కాంగ్రెస్ వేసిందని ఆయన తెలిపారు. పదేళ్లపాటు మాదిగలను బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు నిలువునా ముంచాయని ఆయన విరుచుకుపడ్డారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో మాదిగలు ఆగమవుతుంటే మంద కృష్ణ మాదిగ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ బిడ్డ అయిన తనను గుర్తించి కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేసిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తనకు గాడ్ ఫాదర్ లాంటిదని ఆయన పేర్కొన్నారు. మరో 20 ఏళ్ల పాటు సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు.

సిఎం రేవంత్‌తో మల్లు రవి, సంపత్‌కుమార్‌ల భేటీ
సిఎం రేవంత్‌రెడ్డిని సంపత్‌కుమార్, మల్లు రవిలు శుక్రవారం కలిశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లో కాంగ్రెస్ విజయానికి చేయాల్సిన వ్యూహాంపై వారు ముగ్గురు చర్చించారు. మల్లు రవి, సంపత్ కుమార్‌లతో సిఎం సుదీర్ఘంగా చర్చించారు. నాగర్ కర్నూల్లో విజయం సాధించేందుకు ఇద్దరు నాయకులకు సిఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. కాగా, అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మల్లు రవి భేటీ అయ్యారు. సంపత్ ఇంటికి వెళ్లి తనకు సహకారం అందించాలని ఆయన కోరారు. నాగర్ కర్నూల్ స్థానాన్ని సంపత్‌కుమార్ కూడా ఆశించారు. అనంతరం వారిద్దరూ సిఎం రేవంత్ ఇంటికి వెళ్లారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular