Monday, May 20, 2024

ప్రభుత్వాన్ని నడపమంటే పాన్​ డబ్బా నడపినట్లు కాదు

* ప్రభుత్వాన్ని నడపమంటే పాన్​ డబ్బా నడపినట్లు కాదు
* బీఆర్​ఎస్​ గెలిస్తే గుంపు మేస్త్రీ ఇంటికే
* కల్వకుర్తి సభలో మాజీ మంత్రి కేటీఆర్​
టీఎస్​, న్యూస్​: ప్ర‌భుత్వాన్ని న‌డుపుడు అంటే పాన్ డ‌బ్బా న‌డిపినంతా ఈజీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా అదే ధోరణిలో ఉన్నారని మండిపడ్డారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఆయనలో కనిపించకపోవడం శోఛనీయమని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్.. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని మాట్లాడారన్నారు. మ‌రి క‌ల్వ‌కుర్తిలో రియ‌ల్ ఎస్టేట్ ఎందుకు పెర‌గ‌లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన అంటే నోటికొచ్చిన‌ట్టు, ఇష్ట‌మొచ్చిన‌ట్టు బూతులు మాట్లాడం కాదు. ….  ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం  ఉండాలన్నారు. ద‌క్ష‌త ఉండాలన్నారు. అది ఉన్న నాయ‌కుడు కేసీఆర్ కాబ‌ట్టి రియ‌ల్ ఎస్టేట్ పెరిగిందన్నారు. భూముల ధ‌ర‌లు పెరిగాయన్నారు. ఫలితంగా రాష్ట్రానికి దేశ, విదేశాలకు చెందిన అనేక  ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా  నాగర్ కర్నూల్  ఎంపీ పార్టీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్ కు మద్దతుగా బుధవారం కల్వకుర్తిలో నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అర‌చేతిలో వైకుంఠం చూపిడితే ప్రజలు మోసపోయారన్నారు. రెండు ల‌క్షల రుణ‌మాఫీ, బ‌స్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రూ. 2500 ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. మహిళలకు స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ లూటీ మొద‌లైందని విమర్శించారు. మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు వేయించుకున్నాక ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. పైగా సిగ్గు లేకుండా రేవంత్ మాట్లాడుతూ,  ఐదు గ్యారెంటీలు అమ‌లు చేశాన‌ని బొంకుతున్నాడని మండిపడ్డారు.  పైగా లంకె బిందెలు ఉన్నాయ‌ని వ‌స్తే..  ఇక్క‌డ ఖాళీ కుండ‌లు ఉన్నాయ‌ని అంటున్నాడని ఎద్దేవా చేశారు. లంకె బిందెల కోసం దొంగ‌లు తిరుగుతారన్నారు. సీఎం స్థాయిలో ఉండి అన్ని రోత మాట‌లు మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పేగులు మెడ‌లో వేసుకుంటా అంటున్నాడని…. ఆయ‌న ముఖ్య‌మంత్రా..? బోటి కొట్టేటోడా..? అని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
అందువల్ల  అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను మరోసారి ఎంపీ ఎన్నికల్లో పునరావృతం కావొద్దు అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ స్థానంతో పాటు 12 ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వండి.. ఆరు నెల‌ల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసిస్తారన్నారు. అప్పుడు గుంపు మేస్త్రీ ఇంటికి పోయే ప‌రిస్థితి వ‌స్తుందన్నారు. ఐదు నెల‌ల కింద‌ట క‌ల్వ‌కుర్తి, ఆమ‌న్‌గ‌ల్‌కు వ‌చ్చానని అన్నారు. అప్పుడు కూడా ప్రజల నుంచి ఇదే రీతిలో మంచి స్పందన లభించిందన్నారు. అసెంబ్లీ అభ్యర్ధి జైపాల్ యాద‌వ్ గెలిచిండు అనుకున్నా.. కానీ ఫలితం చూస్తే తారుమారు  అయిందన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ మంచి వ్యక్తి…ఆదరించండి
ఐపీఎస్ ఆఫీస‌ర్.. విజ్ఞాన‌వంతుడు.. ఒక అధికారిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్య‌క్తి అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1000 గురుకులాల‌ను కేసీఆర్ ప్రారంభిస్తే.. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిన మొన‌గాడన్నారు.  ఇలాంటి అభ్య‌ర్థి నాగ‌ర్‌క‌ర్నూల్‌కు మ‌ళ్లీ దొర‌క‌డన్నారు. ఆయ‌న పార్ల‌మెంట్‌లో అడుగు పెడితే మ‌న గౌర‌వం పెరుగుతుందన్నారు. రాజ‌కీయ నాయ‌కులు బొచ్చెడు మంది ఉంటారన్నారు. పైస‌లు ఉన్నోళ్లు రాజ‌కీయాల్లోకి వ‌స్తుంటారు….కానీ ఒక పేద కుటుంబం నుంచి క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని ఐపీఎస్ అయిన వ్య‌క్తి ఆర్ఎస్పీ అని అన్నారు.  ఐపీఎస్ ఆఫ‌సీర్‌గా ఏడేనిమిదేండ్ల‌ స‌ర్వీసు ఉన్నాకూడా అది వ‌దిలిపెట్టి ప్ర‌జా సేవం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా మ‌న కోసం పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నో బంప‌రాఫ‌ర్‌లు ఆర్ఎస్పీకి వచ్చినా….వాటికి ఆశపడని వ్యక్తి అని ప్రశంసించారు.
గ‌తంలో క‌ల్వ‌కుర్తిలో ఏమైనా పొర‌పాట్లు జ‌రిగితే మ‌న‌సులో నుంచి తీసేయండన్నారు.  పొర‌పాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. రేవంత్ రెడ్డి ఒక‌టే అంట‌డు. రుణ‌మాఫీ చేయ‌కున్నా, రూ. 2,500 ఇవ్వ‌కున్నా, రూ. 4 వేల పెన్ష‌న్ ఇవ్వ‌కున్నా, స్కూటీలు ఇవ్వ‌కున్నా నాకే ఓటేశారంటారన్నారు. కాబ‌ట్టి ఆలోచించి ఆర్ఎస్పీని గెలిపించండి అని కేటీఆర్ విజ్ఞ‌ఫ్తి చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular