Saturday, April 27, 2024

టిఎన్జీఓ సంఘంలో పదవుల కోసం పాకులాట..!

  • టిఎన్జీఓ సంఘంలో పదవుల కోసం పాకులాట..!
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి కోసం 8 మంది పోటీ…

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టిఎన్జీఓ సంస్థలో వివాదాలు ఇంకా సద్దుమణగడం లేదు. ఇన్ని రోజులుగా అధ్యక్షుడి ఎన్నికపై సందిగ్ధత ఏర్పడడం, టిఎన్జీఓ ఎన్నికలకు సంబంధించి కోర్టు కేసులో ఉండడంతో అధ్యక్ష, కార్యదర్శ ఎన్నికలను ఎలా నిర్వహించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి టిఎన్జీఓ నాయకులు తీసుకెళ్లడంతో ఈ సంఘంపై కోర్టులో కేసు వేసిన టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాయికంటి ప్రతాప్‌ను చర్చలకు పిలిపించి ఆయనతో రాజీ చేసి ఎన్నికలు నిర్వహించేలా ఒప్పించారు. ప్రతాప్ వేసిన కోర్టును వెనక్కి తీసుకున్నందుకు ఆయనకు టిఎన్జీఓలో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పదవి ఇస్తామని టిఎన్జీఓ ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తో పాటు మధ్యవర్తిత్వం వహించిన కొందరు పెద్దలు సైతం రాయికంటి ప్రతాప్ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ప్రతాప్ కోర్టు కేసును వెనక్కి తీసుకోవడంతో ప్రస్తుతం టిఎన్జీఓ అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్‌ను వారం క్రితం టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం జరగాల్సిన ప్రధాన కారదర్శి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పట్టించుకోవడం లేదని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు కేసును విరమించుకుంటే తనకు పదవి అప్పగిస్తామని 15 రోజుల క్రితం హామిఇచ్చిన పెద్దలపై టిఎన్జీఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఒత్తిడి తెస్తుండగా, ప్రస్తుత అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వారి మాటలను పట్టించుకోవడం లేదని ప్రతాప్ ఆరోపిస్తున్నారు. అయితే కోర్టు ఎదుట తనకు పదవి ఇస్తామని వారు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తేనే తాను కోర్టు కేసును వెనక్కి తీసుకున్నానని అధ్యక్ష పదవి వచ్చాక మారం జగదీశ్వర్ పట్టించుకోక పోవడం బాధాకరమని ప్రతాప్ వాపోతున్నారు. అయితే దీనిపై టిఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ తరువాత రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతాప్‌కు పదవి విషయం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మారం జగదీశ్వర్ పేర్కొనడం విశేషం.

రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్‌ల మధ్య పోటీ

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సుమారు 8 మంది పోటీపడుతుండగా అందులో సీనియర్‌లైన ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రస్తుత టిఎన్జీఓ అధ్యక్షులే రాష్ట్ర ప్రధాన కారద్యర్శి పదవికి పోటీ పడుతుండడం విశేషం. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శి ఎంపికయ్యే అవకాశం ఉందని టిఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురిలో ఉద్యోగుల సమస్యల గురించి నిరంతరం శ్రమించే నాయకుడినే తాము ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు దాటినా ఉద్యోగ సంఘాల్లో పెద్దదైన టిఎన్జీఓ సంఘం మాత్రం ఇంకా కార్యవర్గం ఏర్పాటులోనే వివాదాలు కొనితెచ్చుకుంటుండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నాయకులు పదవుల పంపకాల కోసం పాకులాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular