Sunday, May 5, 2024

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు

  • ఈసారి నాలుగైదు డిగ్రీలు అధికం…
  • పసిఫిక్ మహా సముద్రంలో పెరిగిన ఉపరితల ఉష్ణోగ్రతలు

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఏడాది మార్చి నుంచి – మే నెలల మధ్య వేసవి చండప్రచండంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనావేసింది. గతేడాది (2023) మొదలైన ఎల్ నినో ఇందుకు కారణమని, దీని వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సదరు సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి 32 -నుంచి 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే ఆ పరిస్థితిని సూపర్ ఎల్‌నినో అంటారు. ప్రస్తుత వేసవి కాలంలో ఈ పరిస్థితి తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మార్చి మొదటి వారం నుంచి అధికంగా ఉక్కపోత
మండే ఎండలకు తోడు ఈసారి విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటోందని వారు తెలిపారు. ఇలా ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండటాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ‘ఫీల్ లైక్ టెంపరేచర్’ అంటారని, గాలిలో తేమ శాతం పెరగడమే వేడి తీవ్రతకు కారణమని వారు పేర్కొంటున్నారు. తేమ శాతం పెరిగే కొద్దీ ఎండ వేడిమి కూడా తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల ఉక్కపోత ఎక్కువ అవుతుంది. మండే ఎండలకు తోడు ఉక్కపోత పెరిగితే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పరిస్థితి మార్చి మొదటి వారంలోనే మొదలయ్యింది.

2024 జూన్ నాటికి తగ్గనున్న ఎల్‌నినో ప్రభావం
2024 జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం తగ్గి, పరిస్థితి సద్దుమణుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. మే నెల చివరి నాటికి లానినో ఏర్పడుతుందని, ఫలితంగా ఈ వర్షాకాలంలో మునుపటి కంటే వానలు బాగా పడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మండుతున్న ఎండలు ఒంట్లో ఉష్ణోగ్రతను పెంచేస్తున్నాయి. యూవి కిరణాల ప్రభావం ముఖంతో పాటుగా మొత్తం శరీరంపై పడుతుంది. చెమట పట్టడం, తరచుగా దాహం వేయడం, అలసట కలుగుతాయి. ఎండాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలాసార్లు డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, మైకం, కంటి నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular