Sunday, May 5, 2024

ఏఐసిసి కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరు…

  • ఎవరూ పార్టీలో చేరినా చేర్చుకుంటాం
  • పార్టీకి నష్టం చేసినవాళ్లు అయినా
  • చేర్చుకోవాలని ఏఐసిసి ఆదేశించింది
  • పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

ఏఐసిసి కంటే ఇక్కడ తోపులు ఎవరూ లేరని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరూ పార్టీలో చేరినా చేర్చుకుంటామన్నారు. గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల వారు చేరికపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జగ్గారెడ్డి, కోదండ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీకి నష్టం చేసినవాళ్లు అయినా చేర్చుకోవాలని ఏఐసిసి ఆదేశించిందన్నారు. నాయకులు ఎవరూ నారాజ్ కావద్దని, కలిసి పని చేయాల్సిందేనని ఆయన తెలిపారు. తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లు వచ్చి చేరినా తాను అభ్యంతరం చెప్పనని ఆయన అన్నారు. ఎన్నికల వరకు పార్టీలో పని చేసి ఎన్నికల సమయంలో కొందరు బయటకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. వాళ్లను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని ఏఐసిసి, పిసిసిని ఆదేశించిందన్నారు.

కండిషన్‌తో చేరికలు ఉండవు
బిఆర్‌ఎస్ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని ఏఐసిసి నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎవరూ పార్టీలోకి రావాలని అనుకున్నా కండువా కప్పేస్తామన్నారు. కండిషన్‌తో చేరికలు ఉండవన్నారు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లతో కొంత స్థానిక నాయకులకు ఇబ్బంది ఉంటుందన్నారు. పార్టీలోకి చేరే వాళ్లంతా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. జవాబుదారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఓడిపోయిన వాళ్లు నారాజ్ కావద్దన్నారు. మీడియాకు ఎక్కొద్దు, ఇది అధిష్టానం ఆదేశం అన్నారు. అందరూ కలిసి పని చేయాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌కు నిర్దిష్ట సిద్ధాంతం, నియమాలు ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీలో చేరే వారిని బేషరతుగా పార్టీలోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని ఏఐసిసి తమకు ఆదేశాలు జారీ చేసిందని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో చేరేందుకు వచ్చే నాయకులు వారి నియోజక వర్గ ఎమ్మెల్యేలకు, నియోజక వర్గ ఇన్‌చార్జీలకు, డిసిసి అధ్యక్షులకు సమాచారం ఇచ్చి గాంధీభవన్‌కు రావాలని ఆయన సూచించారు. ప్రాంతీయ పార్టీలది అవకాశవాదమే ఎజెండా అన్నారు. బిజెపి కూడా రూపాంతరం చెందిందన్నారు. అద్వానీ, మోడీ వేర్వేరు పద్ధతిలో విధ్వంసం చేశారన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టారని ఆయన మండిపడ్డారు.
Tags: PCC Working President Jaggareddy, revanth reddy, tsnews politics

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular