Thursday, May 9, 2024

రైతు సంక్షేమం పట్టని మోడీ సర్కారు

* బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజం

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదని, అన్నదాతల విషయంలో ఇది అసమర్థ సర్కారు అని కాంగ్రెస్ సీనియర్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా వ్యవసాయం రంగంలో ఎన్డీఏ ఘోరంగా విఫలమైందని పేర్కొంటూ ఎనిమిది అంశాలను ప్రస్తావించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అసమర్థ, హానికరమైన విధానాలకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు.

* ‘మోదీ సర్కారు విఫలమైన అన్ని అంశాల్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ చూపించిన అసమర్థ, హానికర ప్రవర్తన అత్యంత ప్రమాదకరమైనది. ఈ శాఖ విఫలమైన తీరు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తోంది’ అని విమర్శించారు. జీఎస్టీని రైతు వ్యతిరేక చర్యగా అభివర్ణించిన ఆయన.. జీఎస్టీ కారణంగా రైతులకు అవసరమైన అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా ట్రాక్టర్ల ధరలు పెరగడమే ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

* ‘2004-05లో యూపీఏ తొలి బడ్జెట్ లో ట్రాక్టర్లపై ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేశాం. కానీ ఇప్పుడు జీఎస్టీ కారణంగా ట్రాక్టర్లపై 12 శాతం పన్ను పడుతోంది. అలాగే ట్రాక్టర్ల టైర్లపై 18 శాతం, స్పేర్ పార్టులపై 28 శాతం భారం పడుతోంది’ అని పేర్కొన్నారు.

* రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఏమైందని జైరాం ప్రశ్నించారు. ‘రైతులకు మోదీ ఇచ్చిన అతిపెద్ద తప్పుడు హామీ ఇది. 2016 నుంచి 2022 మధ్యకాలంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ ఆ ఆరేళ్లలో వారి ఆదాయం ఏటా 12 శాతం పడిపోయింది’ అని వివరించారు. తాజాగా ఎన్ఎస్ఎస్ఓ ఎస్ఏఎస్ నివేదిక ప్రకారం 2015 నుంచి 2019 మధ్యకాలంలో వ్యవసాయ రంగ ఆదాయం కేవలం 2.8 శాతమే పెరిగిందని పేర్కొన్నారు. ఇవి కరోనా కంటే ముందు గణాంకాలని.. దీనికి కరోనాను సాకుగా చెప్పి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేశారు.

* కనీస మద్దతు ధరలో సరైన పెరుగుదల లేకపోవడంతో రైతులు మళ్లీ రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ‘యూపీఏ సర్కారు వరి కనీస మద్దతు ధరను 134 శాతం, గోధుమ మద్దతు ధరను 119 శాతం పెంచగా.. మోదీ సర్కారు వాటిని 50 శాతం, 47 శాతం మేర మాత్రమే పెంచాయని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకు ఇవి ఏమాత్రం సరిపోవని ఆయన స్పష్టంచేశారు. పంటల వైవిధ్యం, నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటం, వాణిజ్య విధానంలో వైఫల్యం, పెరుగుతున్న రుణభారం, రైతు ఆత్మహత్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఘోర వైఫల్యాలేనని జైరాం పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular