Saturday, May 11, 2024

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మూడోస్థానమే….

  • విద్యుత్, వాటర్ విషయంలో లెక్కలు తీద్దాం
  • తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎండిపోయిన రిజర్వాయర్లను
  • బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు అప్పచెప్పింది
  • లేనిపోని అబద్ధాలతో కెసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు
  • కెసిఆర్ మరీ ఇంత అధికార దాహం ఎందుకు…?
  • విలేకరులతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్

రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మూడోస్థానం దక్కుతుందని, నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండోస్థానం దక్కుతుందని తమ సర్వేలో తేలిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్, వాటర్ విషయంలో లెక్కలు తీద్దామని, గతంకన్నా ఇప్పుడు తాము జాగ్రత్తతో వ్యవహారిస్తున్నామని నిరంతరం కరెంట్‌పోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం విలేకరులతో సిఎం రేవంత్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎండిపోయిన రిజర్వాయర్లను బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమకు అప్పచెప్పిందని, ప్రస్తుతం దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా బోర్లు ఎండిపోయాయని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో కొందరు అధికారులు బిఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆ సమయంలో వారు వాటర్, కరెంట్ సరఫరా విషయంలో కావాలనే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు.

దానిని తాము గమనించి కొందరు అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని సిఎం రేవంత్ అన్నారు. కరెంట్, వాటర్ విషయంలో బిఆర్‌ఎస్ కుటిల రాజకీయాలు చేయడంతో పాటు ఆ తప్పును మా ప్రభుత్వంపై నెట్టివేయడానికి ప్రయత్నించిందని, దానిని తాము తిప్పికొట్టడంలో విజయవంతం అయ్యామని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతం కొత్త కరెంట్ కనెక్షన్‌లకు తమ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఆయా ఏరియాల్లో కొత్త కనెక్షన్‌లు ఇచ్చేటప్పుడు కొంతమేర ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని సిఎం రేవంత్ తెలిపారు. లేనిపోని అబద్ధాలతో కెసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని కెసిఆర్ అబద్ధం చెప్పారని, ఈరోజు మహబూబ్‌నగర్‌లోనూ కెసిఆర్ అవే అబద్ధాలు చెప్పారని సిఎం రేవంత్ ఫైరయ్యారు. కెసిఆర్ మరీ ఇంత అధికార దాహం ఎందుకని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

రైతుల మృతులపై బిఆర్‌ఎస్‌వి తప్పుడు ఆరోపణలు
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 200మంది రైతులు మృతిచెందారని బిఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి అందిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు 18 మంది రైతులు మృతిచెందారని, దానికి సంబంధించి వారి కుటుంబాలు ప్రభుత్వం నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగునెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకు సుమారుగా రూ.24 వేల కోట్ల పైచిలుకు చెల్లించామని ఆయన అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతికి సంబంధించి వైట్‌పేపర్‌ను తాము విడుదల చేశామని, దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చ చేపట్టామని ఆ చర్చలో పాల్గొనాలని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు మాజీ సిఎం కెసిఆర్‌కు సూచించినా ఆయన అసెంబ్లీ వైపు రాలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ ఓ టివిలో షోకు వెళ్లి నాలుగు గంటల పాటు ఇంటర్వూ ఇవ్వడం ప్రజలకు ఆయనపై ఉన్న అభిమానం అర్థమవుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కచ్చితంగా వంశీచంద్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారని సిఎం రేవంత్ అన్నారు. 2004 సంవత్సరంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని ప్రస్తుతం ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని ఆయన అన్నారు.

ఫిల్లర్‌లు దెబ్బతిన్న విషయం గత ప్రభుత్వానికి ముందే తెలుసు….
కెఏ పాల్, కెసిఆర్ మాటలను నమ్మాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో తాము ఎంఐఎంకు గట్టి పోటీ ఇస్తామన్నారు. 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేశామని, తమకు ఇంకా నాలుగేన్నర ఏళ్ల పాలన మిగిలి ఉందని, మిగిలిన హామీలను కూడా తాము అమలు చేస్తామని, అయినా బిఆర్‌ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బెల్టుషాపులు మూతపడ్డాయని ఆయన అన్నారు. తాము గత ప్రభుత్వం మాదిరిగా మద్యాన్ని ప్రజల నోట్లో మద్యం పోయడం లేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఫిల్లర్‌లు దెబ్బతిన్న విషయం ముందుగానే గత ప్రభుత్వానికి తెలుసనీ, ఈ విషయమై ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న కంపెనీకి సైతం గత ప్రభుత్వం లేఖ సైతం రాసిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ ప్రభుత్వం అప్పుడే ఆ ఫిల్లర్‌ల మరమ్మతుల విషయంలో చొరవ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఉండేదని సిఎం రేవంత్ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular